మెలోడితో మ్యాజిక్ చేసే అనూప్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

తెలుగువాళ్లకు సంగీతం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సినిమా సంగీతం అంటే మహా పిచ్చి. అయితే వారిని ఆకట్టుకోవటం అంత ఈజీ కాదు. ఎందరో సంగీత దర్శకులకు ప్రతీ సంవత్సరం తెలుగు పరిశ్రమ అవకాశాలు ఇస్తూంటుంది. అయితే ప్రూవ్ చేసుకునేది బహుకొద్ది మందే. అలా దర్సకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన జయం చిత్రంతో  పరిచయమై ..ఇక్కడున్న పోటీని తట్టుకుని తనకంటూ ఓ శైలిని, స్టైల్ ని ఏర్పాటు చేసుకుని బిజీగా ఉన్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. 
సినిమా వర్కవుట్ కాకపోవచ్చేమో కానీ తను మాత్రం ఎక్కడా ఫెయిల్ అవడు అనూప్…అదే అతన్ని ఈ రోజున శిఖరాగ్రాన నిలబెట్టింది. ముఖ్యంగా మెలోడి కావాలంటే ఆయన్ని తలుచుకోవాల్సిందే. 
ఆయన పుట్టింది,పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. ఎమ్ కామ్ వరకూ చదివిన ఆయన కర్నాటిక్, హిందుస్దానీలో డిప్లమో చేసారు. ఆర్పీ పట్నాయిక్, చక్రి, శ్రీలేఖ వంటి సిని సంగీత దర్శకుల వద్ద కో బోర్డ్ ప్లేయర్ గా పనిచేసారు. 
అనూప్ ప్లస్ పాయింట్ బాగా కష్టపడటం అంటారు ఆయనతో పనిచేసినవాళ్లంతా. అందుకేనేమో తొలి సినిమా జై నుంచి ప్రతీ సినిమా ఆయనకు మంచిపేరే తెచ్చిపెట్టింది. ప్రతీ సినిమాలో ఒక్కో పాట హైలెట్ అవుతూ వచ్చింది. దేవిశ్రీప్రసాద్, హ్యారీస్ జైరాజ్ లను అభిమానించే ఆయన తన చిన్నతనం నుంచే సంగీతం అంటే అభిరుచి ఉండేదని చెప్తారు. తన స్నేహితుడు 150 రూపాయలకు గిటార్ అమ్మేస్తుంటే కొన్న ఆయన ఇప్పటికి దాన్ని  ఓ మధుర జ్ఞాపకంగా ఉంచుకున్నారు. మొదట్లో ఆయన చర్చలో పాటలు పాడేవారు, క్రైస్తవ పాటలకు ట్యూన్స్ కట్టేవారు. తర్వాత పియోనో నేర్చుకుని సంగీతానికే అంకితమయ్యారు.   ఇళయరాజా, ఎఆర్ రహమాన్, ఆర్ డి బర్మన్ వంటి గొప్ప సంగీత కారుల సంగీతం ఎప్పుడూ తనకి ప్రేరణ ఇస్తుందని ఆయన చెప్తారు. చెవులకు ఇంపైన, హమ్ చేసుకోగలిగిన సంగీతం అందించాలనేదే మొదట నుంచి తన లక్ష్యం అని, ఆ దిశగానే తాను అడుగులు వేస్తున్నానని చెప్తున్నారు. అందుకే ఆయన ఎక్కువగా మెలోడిలు అందుస్తూంటారు. 
ఎప్పుడు విన్నా ఫ్రెష్ గా అనిపించే సంగీతం అందించే ఆయన మరిన్ని సినిమాలకు అద్బుతమైన సంగీతం అందించాలని తెలుగు 100 కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.