‘గళగంధర్వుడు’ ని గుర్తు చేసుకుంటూ…

పురాణ ప్రవచనంలోనే కాక ప్రత్యక్షవ్యాఖ్యానాలలోనూ  శ్రోతలను మంత్రముగ్ధులను చేసి చెరగని ముద్ర వేసుకున్న ‘గళగంధర్వుడు’ ఉషశ్రీ ని  తెలుగు జాతిని మర్చిపోవటం కష్టం . ముఖ్యంగా ఓ తరంలో  ఆయన గొంతును గుర్తు పట్టని లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు  ఆయన 90వ జయంతి. ఈ సందర్బంగా ఆయన్ని మరోసారి గుర్తు చేసుకుందాం.

ఉషశ్రీ అసలు పేరు పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు.   మార్చ్ 16, 1928 సంవత్సరంలో జన్మించిన ఆయన…. ఆల్ ఇండియా రేడియో, విజయవాడలో పనిచేశారు. ఈయన రేడియోలో సీరియల్ గా చెప్పిన మహాభారతం, భాగవతం వంటి పురాణాలు ఎంతో పేరు తెచ్చాయి. ఆ రోజుల్లో చదువురాని వారు కూడా అర్థం చేసుకునే సరళమైన భాషలో, అందరిని రేడియో ముందు కూర్చోబెట్టగలిగారు.  అంతేకాదు  భద్రాచల సీతారాములవారి కల్యాణం ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చింది ఆయనే. రాజమండ్రి, కొవ్వూరు మధ్య గోదావరి నదిమీద రైల్-రోడ్ ప్రారంభోత్సవానికి శ్రీ శంకరమంచి సత్యంగారితో కలిసి ప్రత్యక్షవ్యాఖ్యానం చేశారు.  1960లో ఆయన వ్రాసిన ‘పెళ్ళాడే బొమ్మ’ కృష్ణ పత్రికలో చాలా ఫేమస్ అయ్యింది.  1961లో ‘వెంకటేశ్వర కల్యాణం’ యక్షగానం వ్రాశారు.  ఈయన రచించిన రచనలు కొన్ని ‘ఉషశ్రీ రామాయణం’ ఉషశ్రీ భారతం’ ఉషశ్రీ భాగవతం’ ఉషశ్రీ సుందరకాండ’ ‘మల్లెలపందిరి’ ‘అమృత కలశం’ రాగ హృదయం’ ఇంకా ఎన్నో…… ఈయన వ్రాసిన ‘ఆతిథి మర్యాద’ కథ ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశంగా ప్రచురితం అయ్యింది. ఇంకా లాల్ బహదూర్ శాస్త్రిగారు హైదరాబాదు విచ్చేసినప్పుడు కామెంట్రీ ఇవ్వటం జరిగింది. అలాగే   ఈయన రాజాజీ ఉపన్యాసాలను అనువదించారు. అప్పట్లో ఉషశ్రీ గారి గురించి ఓ మాట గొప్పగా చెప్పేవారు..అదేమిటంటే… విజయవాడ పుష్కారాలకు కృష్ణానదిలో పవిత్రస్నానం ఆచరించటం కన్నా ఉషాశ్రీగారిని చూడటానికి జనాలు గుంపులుగుంపులుగా వొచ్చేవారట. అంతటి మహానుభావుడు ఈ రోజు మన మధ్యన లేకపోవచ్చు.కానీ ఆయన వదిలి వెళ్లిన సాహిత్యం, గళం మాత్రం తెలుగు జాతికి వరం.